మేడారానికి పోటెత్తిన భక్తులు

 వరాలిచ్చే.. కోరిన కోర్కెలు తీర్చే ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క-సారలమ్మల పూజారులు మండమెలిగె పండగను ఘనంగా నిర్వహించి మహా జాతరకు నాందిపలికారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల నడుమ మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారక్క ఆలయాల్లో పూజారులు పండుగను వైభవంగా జరిపారు. 


 


ప్రధాన పూజారి సిద్ధ్దబోయిన మునీందర్‌ ఇంటి నుంచి మామిడి తోరణాలు, పసుపు కుంకుమలు తీసుకొని డోలి, ఇతర వాయిద్యాల నడుమ గ్రామంలోని బొడ్రాయి, గ్రామదేవత పోశమ్మ మందిరాలకు చేరుకొని పూజలు నిర్వహించారు. గ్రామానికి వచ్చే రెండు ప్రధాన రహదారులకు ఇరువైపులా కర్రలకు మామిడి తోరణాలు, ఆనపకాయ బుర్ర, కోడిపిల్లను కట్టి గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా కట్టువేసి ధ్వజస్తంభాలను నిలబెట్టి అష్ట దిగ్బంధనం చేశారు.